బీఆర్ఎస్ సభను సంతాప సభ తో పోల్చిన బండి సంజయ్

టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ కావడం తో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..ఇతర పార్టీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బిఆర్ఎస్ సభ ను సంతాప సభ తో పోల్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సంతాపసభలా ఉందని… సభకు హాజరైన ఏ ఒక్కరి ముఖంలో కూడా నవ్వు లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేశారని… ఇకపై తెలంగాణ గురించి మాట్లాడే అర్హతను కేసీఆర్ కోల్పోయారని చెప్పారు. కర్ణాటకలో డిపాజిట్ రాని వాళ్లను సభకు పిలిపించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని కొత్త నిర్వచనం చెప్పారు. సమైక్యవాది ఉండవల్లి అరుణ్ కుమార్ ను తీసుకొచ్చి దావత్ ఇచ్చిన కేసీఆర్… ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను లేపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

బిడ్డ లిక్కర్ స్కామ్ దందాను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే బీఆర్ఎస్ డ్రామాను కేసీఆర్ మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పులు కుప్పగా తయారు చేశారని మండిపడ్డారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదని అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాధినేతలు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఇక ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు ఆమోదం తెలుపడం తో శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించితిన్ కేసీఆర్.. బీఆర్ఎస్ ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.

ఇక బిఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి ముహూర్తం బ్రహ్మాండంగా కుదిరిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి తిరుగుండదని , ముహూర్త సమయానికి గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని సిద్ధాంతులు చెబుతున్నారు. దసరా పండుగ రోజు జాతీయ పార్టీని ప్రకటించిన ముహూర్తానికి ‘గురువు’ అనుగ్రహం పరిపూర్ణంగా కుదిరిందని, తాజాగా నేటి ముహూర్తానికి కూడా గురువే పాలకగ్రహం అయ్యిందని, ఇది విశేషమని వివరిస్తున్నారు. లగ్నంలో.. అందులోనూ స్వక్షేత్రంలో ‘గురువు’ ఉండటం, భాగ్య స్థానంలో రవి, ‘రాజ్య’ స్థానంలో బుధ, శుక్రులు ఉండటం, ‘లాభ’ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉండటం శుభప్రదమని, యోగదాయకమని అభిప్రాయపడుతున్నారు.