ప్రభాకర్ రెడ్డిపై దాడి..ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం: తమిళిసై

Tamilisai

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. “ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి” అని గవర్నర్‌ పేర్కొన్నారు.

కాగా, దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.