విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకురావాలి కానీ అహంకారం పనికిరాదుః నిరంజన్ రెడ్డి ఆగ్రహం

విదేశాలలో అసంబద్ధంగా మాట్లాడి రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీశారని విమర్శ

niranjan-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు రావాలని కానీ అహంకారం పనికి రాదని హితవు పలికారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచిచేసి ముఖ్యమంత్రి మంచి పేరు తెచ్చుకోవాలి అంతేకానీ ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. విదేశాలలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనలో… అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతున పాతిపెడతామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ పోరాడుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బిఆర్ఎస్ ఎప్పుడూ రాజీపడలేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలన్నారు. కృష్ణా జలాల కోసం కెసిఆర్ పోరాడలేదని చెప్పడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందో చెప్పాలన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకున్నట్లు కేంద్రం చెబుతోందన్నారు.

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని… అప్పుడు తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరడం మాట పక్కన పెడితే… నష్టమే ఉంటుందని హెచ్చరించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను తీసుకువెళ్లడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే నిర్మాణం కావలసిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపంచారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డివి అసంబద్ధ వ్యాఖ్యలన్నారు. పాలమూరుకు జాతీయహోదాపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.