దేశంలో అత్యధిక ద్రవ్యోల్భణం ఉన్న రాష్ట్రం తెలంగాణ: నిర్మలా సీతారామన్

తొమ్మిదిన్నరేళ్ళు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణను భ్రష్టు పట్టించిందని విమర్శలు

nirmala-sitharaman-fires-at-kcr-government

హైదరాబాద్‌ః కెసిఆర్ బంగారు తెలంగాణ అని చెబుతున్నారని, కానీ ఉన్న బంగార తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ బిఆర్ఎస్ చేయడం లేదన్నారు.

కుటుంబ పాలనా, అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా కెసిఆర్ వ్యాట్ తగ్గించకుండా బిజెపిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్భణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కానీ ప్రధాని మోడీ అద్భుతంగా పాలిస్తున్నారన్నారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా… రాష్ట్రాలపై భారం లేకుండా మోడీ ప్రభుత్వాన్ని నడిపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీల వల్ల హైదరాబాద్‌కు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోనూ గెలిచి డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు.