ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్..

ఆర్టీసీ ఛైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నియమింపబడ్డారు. ఈ మధ్యనే సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించిన తెలంగాణ సర్కార్…ఇప్పుడు ఛైర్మన్‌గా బాజిరెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే ఆర్టీసీని చక్కదిద్దే పనిలో నిమగ్నమైన సజ్జనార్‌…తన మార్క్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

గోవర్ధన్ రాజకీయ ప్రస్థానం చూస్తే..గోవర్ధన్ స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యాడు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో 14,043 ఓట్లు తేడాతో ఓడిపోయాడు తరువాత, అతను పిఏసిఎస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 1999-2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా, 2004-2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్ పై 26,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి పై 29,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2015-2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు.