పరీక్షా పే చర్చ లో ప్రధాని మోడీ

తల్లిదండ్రుల కలల్ని పిల్లలపై రుద్దకూడదు : ప్రధాని

YouTube video
Pariksha Pe Charcha 2022 with PM Modi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చ-2022 ఐదో విడత కార్యక్రమాన్ని పరీక్ష యొక్క మాటలు, ప్రధాన మంత్రితో అనే నినాదంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలకు ముందు ఎదురయ్యే సమస్యలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, ఒత్తిడిని తట్టుకోగలగడం వంటివాటి గురించి మోడీ మాట్లాడారు.

మోడీ మాట్లాడుతూ..తమ కలలు, ఆకాంక్షలను పిల్లలపై రుద్దవద్దని తల్లిదండ్రులను, టీచర్లను కోరారు. ఆన్‌లైన్ విద్యకు ఆధారం విజ్ఞానాన్ని సంపాదించడమనే సిద్ధాంతమని తెలిపారు. ఆ విజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడం, ఆచరణలో వర్తింపజేయడానికి సంబంధించినది ఆఫ్‌లైన్ విద్య అని చెప్పారు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలని, దానిని ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకోవాలని చెప్పారు. జాతీయ విద్యా విధానం 21 శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చుతుందన్నారు. ఇది భారత దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తుందన్నారు. ఈరోజుల్లో విజ్ఞానం మాత్రమే సరిపోదని, నైపుణ్యాన్ని కూడా సాధించాలని చెప్పారు. విజ్ఞానం, నైపుణ్యాల సమాహారంపై నూతన విద్యా విధానంలోని సిలబస్ దృష్టి పెట్టిందన్నారు.

బాలల నిజమైన సామర్థ్యాలు, ఆకాంక్షలను మనం అర్థం చేసుకుని, శ్రద్ధగా ప్రోత్సహించనంత వరకు వారు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని తెలుసుకోలేరన్నారు. ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతారని చెప్పారు. మనం ఆ సత్తా, సామర్థ్యాలను గుర్తించాలని చెప్పారు. విద్యార్థులు తరచూ సందిగ్ధంలో ఉంటారని, తమ కలలను నెరవేర్చుకోవాలా? తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలా? అనే సందిగ్ధంలో ఉంటారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు అంతులేని అయోమయంలో కొట్టుమిట్టాడుతారని చెప్పారు. తమ పిల్లలకు దేనిమీద ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలని, వారి బలాలను వారు తెలుసుకోవడానికి సాయపడాలని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/