డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌‌లను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi inaugurates the Defence Offices Complexes in New Delhi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌‌లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌లపై దృష్టి పెట్టినపుడు, ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతున్నది ఇదేనన్నారు. ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక సదుపాయాలు కలిగిన పని పరిస్థితుల్లో మరింత మెరుగ్గా పని చేయడానికి త్రివిధ దళాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.

ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం 12 నెలల్లో పూర్తయిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యకలాపాలు జరిగాయని, దీనివల్ల మహమ్మారి సమయంలో వందలాది మంది కూలీలకు ఉపాధి దొరికిందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తున్నవారిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో రక్షణ రంగ కార్యాలయాల సముదాయం కూడా ఉందనే విషయాన్ని వీరు ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు. దీనిని ప్రస్తావిస్తే తమ బండారం బయటపడిపోతుందని వారికి తెలుసునని చెప్పారు. ఈ నూతన కార్యాలయాల్లో దాదాపు 7,000 మంది అధికారులు పని చేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిధ దళాల కార్యాలయాలను ఈ సముదాయంలో ఏర్పాటు చేశారు. త్రివిధ దళాలతోపాటు, సాధారణ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/