పేద ఖైదీల కోసం కేంద్రం సరికొత్త పథకం..

జైల్లో శిక్ష అనుభవిస్తున్న పేద ఖైదీల కోసం కేంద్ర హోంశాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. జరిమానాలు కట్టలేక, బెయిల్ ఫీజులు కట్టలేక జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీల కోసం కేంద్ర హోమ్ శాఖ కొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ‘పేద ఖైదీలకు ఆసరా’అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని… అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది.

దీనిపై హోం మంత్రిత్వ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంతో జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ సమస్యలను పరిష్కరించటానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోందని తెలిపింది.