ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల దుర్మరణం

బంధువు అంత్యక్రియల కోసం చౌటపల్లి వచ్చిన అన్నదమ్ములు

Road Accident
Road accident

ముంబయిః మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. వీరిని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన ఎరుకుల కృష్ణ, సంజీవ్ సురేశ్, వాసుగా గుర్తించారు. బతుకుదెరువు కోసం వీరు కొన్నేళ్ల క్రితం గుజరాత్‌లోని సూరత్ వెళ్లారు. ఐదు రోజుల క్రితం చౌటపల్లిలో వారి బంధువైన ఎరుకల రాములు మృతి చెందారు.

ఆయన అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి నలుగురు అన్నదమ్ములు స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం కుటుంబ సభ్యులను గ్రామంలోనే ఉంచి అన్నదమ్ములు నలుగురు మంగళవారం కారులో తిరిగి సూరత్‌కు బయలుదేరారు. రాత్రికి ఔరంగాబాద్ చేరుకోగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.