నంది అవార్డుల విజేతల ఎంపికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పోసాని

ప్రముఖ నటుడు , రచయిత పోసాని కృష్ణమురళి..తాజాగా నంది అవార్డుల విజేతల ఎంపికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవి నంది అవార్డులు కావని… కమ్మ, కాపు అవార్డులని విమర్శించారు. నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని ఆరోపించారు. అందుకే గతంలో నాకు ఇచ్చిన నంది అవార్డును కూడా వద్దనుకున్నాను అన్నారు. నంది అవార్డు కమిటీలోని 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మ వారేనని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ, జోగినాయుడుతో కలిసి పోసాని పాల్గొన్నారు. గ్రూపులు, కులాలవారీగా అవార్డులు పంచుకున్నారని, తాను గాయం, పవిత్ర బంధం, పెళ్లిచేసుకుందాం, శివయ్య లాంటి ఎన్నో మంచి సినిమాలకు రచయితగా పనిచేశానని, కానీ అప్పుడు రాని నంది అవార్డు టెంపర్ సినిమాలో నటించినందుకు వచ్చిందని, కానీ అది తనకు కమ్మ అవార్డులా కనపడిందన్నారు. నంది అవార్డులు ప్రకటించడానికి ముందే ఫలానా కాంపౌండ్ కి 2 కావాలి.. ఇంకో కాంపౌండ్ కు 3 వెళ్లాలి.. ఇలా పంచేసుకుంటారని, పోసాని కృష్ణమురళి అనేవాడికి నంది అవార్డు ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు.

ఈ అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని…మళ్లీ పాత వాళ్లకు ఇవ్వడమా లేక కొత్త వారితో కొత్తగా స్టార్ట్ చేయాలా ? అనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోసాని తెలిపారు. అయితే దీనిపై సినీ ప్రముఖులు స్పందించారు. నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ అన్నారు.