నంది అవార్డ్స్ ఫై పోసాని చేసిన వ్యాఖ్యల ఫై మురళి మోహన్ ఆగ్రహం

నంది అవార్డ్స్ ఫై నటుడు , రచయిత పోసాని చేసిన వ్యాఖ్యలపై చిత్రసీమలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి నంది అవార్డులు కావని… కమ్మ, కాపు అవార్డులని , నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని పోసాని ఆరోపించారు. అందుకే గతంలో నాకు ఇచ్చిన నంది అవార్డును కూడా వద్దనుకున్నానని, నంది అవార్డు కమిటీలోని 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మ వారేనని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు మురళి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమా రంగంలో కులం అనేది లేదని మురళి మోహన్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఇది నా కులం, అది నీ కులం అని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదని మురళీమోహన్ వెల్లడించారు. ఈ కులాల గొడవ ఈ మధ్యన వచ్చిందే తప్ప, సినిమా రంగంలో ఎవరు ఏ కులం అనేది ఎవరికీ తెలిసేది కాదని అభిప్రాయపడ్డారు. అన్నదమ్ముల్లా ఉండే ఆర్టిస్టుల మధ్య అనవసరంగా చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.

‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కానీ, నేను ఎఫ్ డీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓ సీల్డ్ కవర్ లో పేర్లు ఉంచి సీఎంకు ఇచ్చేవాళ్లం. వాళ్లు ఓకే చేసి సంతకం పెట్టేవాళ్లు. అంతే తప్ప, ఆయన గానీ, ఈయన గానీ అందులో ఏ పేర్లు ఉన్నాయని ఏనాడూ చూడలేదు. ఎప్పుడూ కులాల ప్రసక్తే రాలేదు… టాలెంట్ ను చూసి అవార్డులు ఇచ్చాం. సినిమా అనేదే మాకు కులం. ఇవాళ అందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాల్సింది ఏమిటంటే… అయ్యా, దయచేసి అవార్డులు ఇవ్వండి. ఏడెనిమిదేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదు. వాటిపై నిర్ణయం తీసుకోండి అని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని మురళీమోహన్ తెలిపారు.