చైనాలో మళ్లీ కరోనా కలవరం..50 వేలకుపైగా కేసుల నమోదు

హాంకాంగ్‌లో నెల రోజుల్లో 200 మంది మృత్యువాత
డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న అధికారులు

బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ కాస్తంత కఠినంగానే ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనాను నియంత్రించేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56 వేల కేసులు నమోదైనట్టు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది. వీటిలో సగానికిపైగా జిలిన్ ప్రావిన్స్‌లోనే వెలుగులు చూసినట్టు తెలిపింది. హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనాకు కళ్లెం వేసేందుకు డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకెళ్తామని, త్వరలోనే దానిని చేరుకుంటామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు తెలిపారు.

మరోవైపు, హాంకాంగ్‌లో గత నెల రోజుల్లో 200 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇటీవల మొదలైన వేవ్ కారణంగా ఒక్క హాంకాంగ్‌లోనే ఏకంగా 10 లక్షల కేసులు నమోదుకావడం అధికారుల్లో గుబులు రేపింది. కాగా, చైనా ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. 60 ఏళ్లు దాటిన వారిలో ఇంకా 5 కోట్ల మంది ఇంకా ఒక్క డోసు కూడా తీసుకోలేదు. అలాగే, 50 శాతంమంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/