ట్విట్టర్ లో కేటీఆర్ వరుస తప్పులు చేస్తున్నారు

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఎవరు సాయం అడిగిన క్షణాల్లో చేస్తుంటారు. అయితే ఈ మధ్య కేటీఆర్ ట్విట్టర్ లో వరుస తప్పులు చేస్తూ ట్రోల్స్ కు గురవుతున్నారు. సింగరేణి కాలనీలోని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుణ్ని పోలీసులు పట్టుకోకపోయినా.. 24 గంటల్లోనే అరెస్టు చేశారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం, ఆ తరువాత తప్పుడు సమాచారం వల్ల పొరపాటు జరిగిందని చెప్పడం చేసి విమర్శల పాలయ్యారు. ఇదే అనుకుంటే కరోనా వాక్సిన్ విషయంలో కూడా తప్పుడు పోస్ట్ చేసి ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు, సీఎం కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ ఆరోగ్య సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని కే‌టి‌ఆర్ ట్వీట్ చేసారు. కే‌టి‌ఆర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోని ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పోస్ట్ చేసి, జగన్ ఇచ్చిన స్పూర్తితో ఉద్యమంలా వ్యాక్సినేషన్ అంటూ పోస్ట్ పెట్టారు. అంటే ఇద్దరిలో ఎవరి పోస్ట్ నిజమో అర్ధం కాకుండా ఉంది. అయిన కే‌టి‌ఆర్ చదువుకున్నవారు…వేరే రాష్ట్రంలో ఫోటోని ఎలా పోస్ట్ చేశారో అర్ధం కాకుండా ఉంది. ఎవరో పంపిస్తే కే‌టి‌ఆర్ గుడ్డిగా పోస్ట్ చేసినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.