భారత పర్యటనకు రానున్న నేపాల్ కొత్త ప్రధాని!

జనవరి రెండో వారంలో పర్యటించే అవకాశం
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోడీతో చర్చలు


న్యూఢిల్లీ : నేపాల్ కొత్త ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత పర్యటనకు రాబోతున్నారు. జనవరి రెండో వారంలో ఆయన భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోడీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొదట్లో నేపాల్ ప్రధాని పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఇంతవరకు ఆయన భారత్ కి రాలేదు. కాకపోతే గత నెలలో గ్లాస్గో లో జరిగిన కాప్ 26 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ ని షేర్ దుబా కలిశారు. ఆ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించడం గమనార్హం. కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపించిన సమయంలో ఇరు దేశాలు గొప్పగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టు ఇరు నేతలు గుర్తించారు. ముఖ్యంగా భారత్ టీకాలు, ఔషధాలు, వైద్య పరికరాలను నేపాల్ కు పంపించింది.

నేపాల్ లో పూర్వపు ప్రధాని కేపీ శర్మ ఓలి హయాంలో భారత్ తో సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. చైనాకు సన్నిహితంగా మసలుకోవడం, భారత్ తో సరిహద్దు అంశాలపై నేపాల్ వివాదాస్పదంగా వ్యవహరించడం చేసింది. కానీ, పొరుగు దేశంతో భారత్ వ్యూహాత్మక ధోరణితో శాంతియుతంగానే వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల పురోగతి దిశగా షేర్ బహదూర్ దుబా తన పర్యటనలో దృష్టి సారిస్తారేమో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఓలి కంటే ముందు కూడా నేపాల్ కు ప్రధానిగా దుబా ఏడు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో భారత్ లో పర్యటించి ప్రధాని మోడీతో చర్చలు కూడా నిర్వహించారు. భారత పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధాని దుబా గుజరాత్ వైబ్రంట్ సదస్సులో పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/