దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నిలుః రాహుల్ గాంధీ

డబ్బులు వచ్చే మంత్రిత్వ శాఖలన్నీ కెసిఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని విమర్శలు

Congress Public Meeting In Kalwakurthy

కల్వకుర్తిః ఈ పదేళ్ళ కాలంలో కెసిఆర్ దోచుకున్న సొమ్మును తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన మాట్లాడుతూ… ఇప్పుడు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓ వైపు అవినీతిపరులైన ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు అని, మరోవైపు రైతులు, పేదప్రజలు అని, ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ కోసం ప్రజలంతా కలలు కన్నారని, తమ ఆశలు నెరవేరుతాయని భావించారని, కానీ కేసీఆర్ పాలనలో వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో డబ్బులు వచ్చే మంత్రిత్వ శాఖలన్నీ కెసిఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని ఆరోపించారు. మద్యం, భూములు, ఆర్థిక.. ఇలా అన్ని శాఖలు వారివద్దే ఉన్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచి, లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. ఈ రోజు ఈ ప్రాజెక్టు వద్దకు వెళ్లి సమీక్షించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. ఇక్కడ పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని, ఈ ప్రాజెక్టును సరిగ్గా నిర్మించలేదన్నారు. ప్రజల డబ్బును దోచుకొని ఆ ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. నాగార్జున సాగర్, ప్రియదర్శిని, జూరాల, సింగూరు సహా ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించాలన్నారు.

ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను ఈ దొరల ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. ధరణి వల్ల ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు. దీని వల్ల కేవలం ఒక కుటుంబానికి.. ఒక వ్యక్తికి మాత్రమే లాభం జరుగుతోందని, కానీ యావత్ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. అందుకే మనం తెలంగాణలో కెసిఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి బైబై కెసిఆర్ అని చెప్పారని, కానీ పేద ప్రజల నుంచి లూటీ చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏం చేయాలి? అని ప్రశ్నించారు. మొదట ఆయనను సీఎం పదవి నుంచి బైబై చేయాలని, ఆ తర్వాత లూటీ సొమ్మును కక్కించాలన్నారు. కెసిఆర్ ఎంత డబ్బు ప్రజల నుంచి లూటీ చేశారో, ఆ ధనాన్ని కాంగ్రెస్ అదే పేద ప్రజలకు ఇస్తుందన్నారు.

తాను నరేంద్రమోడీని కాదని, హామీ ఇచ్చానంటే కచ్చితంగా చేస్తానన్నారు. మీ అందరి ఖాతాల్లో రూ.15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానని మోడీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారని, కానీ ఎవరి ఖాతాల్లోకి రాలేదన్నారు. కానీ అదానీ బ్యాంకు ఖాతాల్లో లక్షల కోట్లు పడ్డాయన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. మన మధ్య ఉన్న బంధం రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధమన్నారు. నెహ్రూ నుంచి ప్రారంభమైందన్నారు. కెసిఆర్ పేద ప్రజల నుంచి లూటీ చేసిన డబ్బును వారి ఖాతాల్లో వేయిస్తానన్నారు. మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలను పునరుద్ఘాటించారు. గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామన్నారు. మహిళలకు బస్సు సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పారు. రైతులు, కార్మికులు తీవ్ర కష్టాల్లో ఉన్నారన్నారు. పెట్టుబడి సాయంగా రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్నారు. గృహజ్యోతి పథకం అందిస్తామన్నారు.

ఈ ఎన్నికలు కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య జరుగుతోందన్నారు. కానీ వాస్తవమేమంటే బిఆర్ఎస్, బిజెపి, మజ్లిస్ ఒక్కటిగా పని చేస్తున్నాయన్నారు. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బిఆర్ఎస్… బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్న తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇంటిని కూడా లాక్కున్నారన్నారు. దేశ ప్రజలంతా నావారే కాబట్టి ఆ ఇంటిని సంతోషంగా ఇచ్చేశానన్నారు. బిజెపిపై పోరాడితే వారిపై కేసులు నమోదవుతాయని, కానీ బిఆర్ఎస్, కెసిఆర్‌పై ఏ కేసు ఉండదన్నారు. సీబీఐ విచారణ, ఈడీ దర్యాఫ్తులు బిఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లరన్నారు. ఎందుకంటే కెసిఆర్, మోడీ ఒకటే అన్నారు. ఇద్దరూ కలిసి పని చేస్తున్నారన్నారు.