జనసేన పార్టీ కి భారీ షాక్…వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న మాదాసు గంగాధరం

జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగాధరం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాదాసు వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్బరంగా ఆయన మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ లఫై తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్‌ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. ఆయన్ను నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారన్నారు. కానీ వారిని నట్టేట ముంచాడన్నారు. నాదెండ్ల మనోహర్‌ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని గుర్తుచేశారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదన్నారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్‌ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొంతకాలంగా జనసేన పార్టీ కి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

ముఖ్యమంత్రి జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా..ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు..గతంలో కాంగ్రెస్ లోనూ పని చేసారు. జనసేన తరపున పని చేస్తూ.. కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం చంద్రబాబు అధినేత పొత్తుల వ్యాఖ్యలు..టీడీపీ – జనసేన పొత్తు ఖాయం అంటూ ప్రచారం సాగుతున్న వేళ..జనసేన మాజీ నేత ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.