నన్ను, నా జాతిని నమ్మించి గొంతు కోశారు – నీలం మధు

కాంగ్రెస్ పార్టీ ని అసమ్మతి సెగలు వదలడం లేదు. మొదటి లిస్ట్ అభ్యర్థుల నుండి చివరి లిస్ట్ అభ్యర్థుల ప్రకటన తర్వాత వరకు ఇదే నడుస్తుంది. తాజాగా ఫైనల్ లిస్ట్ ను గురువారం రాత్రి అధిష్టానం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు స్థానాలను పెండింగ్ లో పెట్టగా వాటిని విడుదల చేసారు. పటాన్ చెరు స్థానంలో మార్పులు చేసింది ఏఐసీసీ. ముందుగా ఈ టికెట్ నీలం మధుకు కేటాయించిన అధిష్టానం..ఇప్పుడు కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు.ఇక సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కి కేటాయించింది.

కాగా పటాన్ చెరు స్థానంలో మార్పులు చేయడం ఫై నీలం మధు ఆగ్రహం వ్యక్తం చేసారు. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ మా జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నన్ను, నా జాతిని నమ్మించి గొంతు కోశారు. మా జాతి ఆత్మ గౌరవాన్ని చులకన చేశారు. మాకు జరిగిన మోసానికి తగిన ప్రతిఫలం తప్పదు. ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా.. బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటాను. నన్ను నమ్ముకున్న ప్రజల, కార్యకర్తల కుటుంబ పెద్దగా అండగా నిలబడతాను. కడుపులో పెట్టి చూసుకుంటా.. నా అనుచరులతో కలిసి నామినేషన్ వేస్తాను.. నాకు జరిగిన మోసాన్ని వివరిస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని నీలం మధు ముదిరాజ్ తేల్చి చెప్పారు.