లాక్‌డౌన్ పెట్టాలా వద్దా.. తల పట్టుకుంటున్న మోదీ!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని ఎలా గడగడలాడిస్తుందో మనం రోజూ చూస్తున్నాం. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతుంటే, రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అటు ప్రజలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలు ప్రశ్ని్స్తు్న్నారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలని చాలా మంది డిమాండ్ చేస్తుంటే, మరికొందరు లాక్‌డౌన్ పెడితే ప్రజలే తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు.

అయితే మే2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని, లాక్‌డౌన్ గురించి ఏదైనా క్లారిటీ ఇవ్వొచ్చని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మే 2న ప్రధాని ప్రకటన గురించి పక్కనబెడితే, అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ పెడితే ఏం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ విధిస్తే, వారి జీవితాలు గందరగోళం కావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఇక వలస కూలీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఉన్న చోట ఉపాధి లేక, సొంతూర్లకు వెళ్లే సదుపాయం లేక కాలినడకతో వారు ప్రయాణం చేయడం మనం చూశాం. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ పెడితే, వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారిపోతుంది. దీంతో చివరి అస్త్రంగా లాక్‌డౌన్‌ను వినియోగించాలని ఇటీవల మోదీ చేసిన ప్రకటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలా వద్దా అని కేంద్ర తర్జనబర్జన పడుతోందట. ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఎదురయ్యే సమస్యలే ఎక్కువ ఉండటంతో కరోనా కట్టడికి ఏం చేయాలనే ఆలోచనతో మోదీ ప్రభుత్వం తల పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టాలా, వద్దా..? మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో తెలపండి.