కేటీఆర్ లండ‌న్ టూర్‌పై టీపీసీసీ కామెంట్స్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం లండన్ లో బిజీ బిజీ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ విదేశీ పర్యటన కొనసాగుతుంది. యునైటెడ్‌ కింగ్‌డం-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాగా కేటీఆర్ పర్యటన పట్ల టీపీసీసీ పలు కామెంట్స్ చేసింది.

మూడు రోజులుగా లండ‌న్‌లో తిరుగుతున్న కేటీఆర్‌… రాష్ట్రంలో దోచుకున్న డ‌బ్బుతో అక్కడ వంద‌ల కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు చేయిస్తున్నారని సమాచారం అందుతోందంటూ టీపీసీసీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆరోప‌ణ చేసింది. లండ‌న్ టూర్‌కు కేటీఆర్ స‌ప‌రివార స‌మేతంగా వెళ్లార‌ని ఆరోపించింది. అదే స‌మ‌యంలో సొంత డ‌బ్బులు ఖర్చు చేసి కేటీఆర్ సొంత నియోజ‌క‌వర్గం సిరిసిల్ల‌లో ప‌నులు చేసిన సర్పంచ్‌లు బిల్లులు రాక‌పోవ‌డంతో మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్ధ‌మ‌య్యార‌ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.