మంత్రి బొత్సని విద్యాశాఖ నుంచి తప్పించాలంటూ జగన్ కు లోకేష్ లేఖ..

ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుండే ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాల్గు రోజులు నాల్గు పేపర్లు లీక్ కు గురి కావడం..పలువురు ఉపాధ్యాయులు అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీని పట్ల టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసారు.

వైసిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వ‌హిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మ‌న దేశంలోని ప‌రీక్ష‌ల చ‌రిత్ర‌లోనే చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. రోజుకొక చోట పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, ఒక‌రి బ‌దులు ఒక‌రిని ఉంచి ప‌రీక్ష‌లు రాయించ‌డం, లీకైన ప్ర‌శ్న‌ప‌త్రాల‌కి జ‌వాబులు రాయించి జ‌త‌ చేయ‌డం వంటివ‌న్నీ జరిగాయని లోకేష్ అన్నారు. ప్ర‌తిభ‌కి కొల‌మానంగా నిల‌వాల్సిన ప‌రీక్ష‌లు అక్ర‌మార్కులకి వ‌రం అయ్యాయి. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్స‌ప్ గ్రూపుల్లో ప్ర‌శ్నాప‌త్రాలు ప్ర‌త్య‌క్షం అవడం, వైసీపీ నాయ‌కుల పిల్ల‌ల‌కి మెరుగైన మార్కుల కోసం బ‌రితెగించార‌ని లోకేష్ అన్నారు.

పేప‌ర్ల లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌పై మీ మంత్రి బొత్స ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని ఇచ్చిన స‌మాధానం బాధ్యతారాహిత్యమని, మంత్రి బొత్సని విద్యాశాఖ నుంచి త‌ప్పించాలని లోకేష్ లేఖలో డిమాండ్ చేశారు. ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా ప‌క‌డ్బందీగా నిర్వహించాలని, టెన్త్ ప‌రీక్షల ఘోర‌ వైఫ‌ల్యంతోనైనా ప్రభుత్వం గుణ‌పాఠం నేర్చుకుని ఇంట‌ర్ ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా నిర్వహించాలని హితవు పలికారు.