కరీంనగర్ అభివృద్దికి రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలంటూ సంజయ్ కి కేటీఆర్ సవాల్

తెలంగాణ మంత్రి కేటీఆర్..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే కరీంనగర్ అభివృద్దికి రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసురావాలని అన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ ప‌దం ఉండేదా? ఈ రాష్ట్రం వ‌చ్చి ఉండేదా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రోడ్ల మీద తిరుగుతూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడుతున్నారు. సోమ‌వారం, మంగ‌ళ‌వారం అంటూ రాజ‌కీయం చేయొద్దని కేటీఆర్ హెచ్చ‌రించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కు ప్రధాని మోడీ దగ్గర పలుకుబడి ఉంటే నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వయసు చూసేది లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడనే విశ్వాసం లేకుండా విమర్శిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే టీపీసీసీ, టీ బీజేపీ వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తులు కూడా ఎగిరెగిరి పడుతున్నారంటూ విమర్శించారు. కొందరు అన్ని మోదీ పైసలతోనే డెవలప్ అవుతుందని అంటున్నారని… పక్క రాష్ట్రం కర్ణాిటక వెళ్లి చూడాలని హితవు పలికారు.

కేంద్రం పైస‌ల‌తోనే రాష్ట్రంలోని ప‌ల్లెలు అభివృద్ధి చెందుతున్నాయంటే.. మ‌రి మోదీ పైస‌ల‌యితే దేశ‌మంతా అభివృద్ధి కావాలి క‌దా? దేశంలోని 6 ల‌క్ష‌ల పల్లెల్లో ఇలాంటి కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయా? తెలంగాణ ప‌ల్లెల్లో జ‌రిగిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఎక్క‌డా లేవు. అభినందించాల్సింది పోయి అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం స‌రికాద‌ని కేటీఆర్ సూచించారు. అడ్డ‌మైన మాట‌లు మాట్లాడం ఆపి అభివృద్ధిలో పోటీ ప‌డాలి. ద‌మ్ముంటే క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాల‌ని బండి సంజ‌య్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.