ఎన్‌ఆర్ పేటలో ఉద్రిక్తత : లోకేష్ ప్రసంగిస్తుండగా మైక్ లాక్కునే ప్రయత్నం చేసిన పోలీసులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు 13 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుండగా..పోలీసులు లోకేష్ ను అడుగడుగునా అడ్డుకోవడం ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు చిత్తూరు జిల్లా ఎన్‌ఆర్‌పేట ఎన్టీఆర్‌ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి లేదంటూ.. లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో-1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ నేతలు , కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు అడ్డుకున్నా.. ఎన్టీఆర్‌ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలో లోకేష్..పోలీసుల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకోవాలా? అని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో లోకేష్ చేతిలో మైకు లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.