ఏపీ రాజధాని అమరావతే తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీ రాజధాని విషయంలో మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని , విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపింది. వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని… ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా… దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తున్నట్టుగా కొత్త బిల్లును తీసుకొచ్చిందని నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకుందని, సీఆర్డీయే చట్టానికి కొనసాగింపుగా మరొక బిల్లును తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని… దీనిపై ఇంతకు మించి మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.