రాష్ట్రంలో గంజాయి విక్రయం ఫై గవర్నర్ కు పిర్యాదు చేసిన నారా లోకేష్

ఏపీలో గంజాయి విక్రయం రోజు రోజుకు పెరిగిపోతుంది. పల్లె , పట్టణం అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. పోలీసులు అధికారులు సైతం చూసి చూడనట్లు ఉంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..శనివారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెబుతున్న డీఆర్‌ఐ నివేదికను ఆధారాలుగా అందజేశారు.

దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉన్నాయని.. ఈ మేరకు డ్రగ్స్‌ కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ తెలిపారు. మరోవైపు హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేష్ కోరారు. లోకేశ్‌తోపాటు గవర్నర్‌ వద్దకు వెళ్లిన వారిలో టీడీపీ నేతలు షరీఫ్‌, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర ఉన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మీడియా తో మాట్లాడుతూ.. వైస్సార్సీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని ఆరోపించారు. డ్రగ్స్‌ ఉత్పత్తి, స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారిలో అధికార పార్టీ నేతలే ఉన్నారన్నారు. గత నాలుగేళ్లలో యువత మత్తులో దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని.. విద్యార్థులపైనా ఈ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.