తారకరత్నను చూసేందుకు హాస్పటల్ కు క్యూ కడుతున్న నందమూరి కుటుంబ సభ్యులు

తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెప్పడం తో హాస్పటల్ లో ఆయన్ను చూసేందుకు నందమూరి కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు. శుక్రవారం నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న ..కాసేపటికే నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్య కర్తలు హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇక తారకరత్న ను చూసేందుకు కుటుంబ సభ్యులు హాస్పటల్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తో పాటు పలువురు హాస్పటల్ కు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఫై ఆరా తీశారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు సైతం హాస్పటల్ కు చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన చంద్రబాబు.. బెంగళూరుకు చేరుకున్నారు. వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి తారకరత్న ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. తారకరత్న భార్య, కుమార్తెలు రాత్రి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈరోజు పురంధేశ్వరి కూడా ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా కాసేపట్లో ఆస్పత్రికి చేరుకోనున్నారు. ఇలా కుటుంబ సభ్యులంతా వస్తుండడం తో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అని నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.