ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. ఈరోజు ఉదయం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు. విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా వీటిని ధ్రువీకరించారు.

ఈ వ్యవహారంలో కార్యకలాపాలకు కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో రెండు నంబర్లతో 10 ఫోన్లను కవిత వాడారని పేర్కొంది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని..ఆ 10 ఫోన్ల IMEI నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు. అయితే 2021 సెప్టెంబరు 1వ తేదీన ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్​ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు. గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.