సిఎం జగన్‌కు కళా వెంకట్రావు లేఖ

భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి..కళా వెంకట్రావు

KALA VENKATRAO

అమరావతి: ఏపిలో భూకుంభకోణం జరుగుతుందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏపి టిడిపి అధ్యక్షుడు కళావెంట్రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు. ఇళ్ల పట్టాల పంపిణీని సూట్‌కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని, ఇళ్ల స్థలాల పేరిట వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 23 వేల ఎకరాల్లో అధికభాగం వైకాపా నేతలవేనని, దుర్మార్గంగా సేకరించిన భూముల స్వీకరణకు ప్రజలు సిద్ధంగా లేరని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూకుంభకోణంపై రిటైర్డ్ లేదంటే సిట్టింగ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై సొంతపార్టీ నేతలే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల బడుగు, బలహీనవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలల పాలనలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/