ముగిసిన విజయ్ దేవరకొండ ఈడీ విచారణ

హీరో విజయ్ దేవరకొండ ను దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు విచారించి వదిలిపెట్టారు. కొద్దినెలల క్రితం విజయ్ హీరోగా ‘లైగర్‌’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు విజయ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. గతంలో ఈడీ విచారణకు ఆ చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్‌, ఛార్మి హాజరుకాగా, ఈరోజు విజయ్ హాజరయ్యారు. ప్రధానంగా సినిమా షూటింగ్‌‌ కోసం ఇద్దరి అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌‌ కోసం ఫారిన్‌‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు ఎవరు పెట్టారనే వివరాలు సేకరించింది. విదేశాల్లో జరిగిన షూటింగ్ సెట్టింగ్స్, అక్కడి నటులకు చెల్లించిన రెమ్యునరేషన్‌‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌ను పరిశీలించినట్లు సమాచారం.

విచారణ అనంతరం మాట్లాడిన విజయ్ దేవర కొండ ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చానని చెప్పారు. ఈడీ వాళ్లకు కొన్ని క్లారిఫికేషన్ కావాల్సి ఉండేనన్న విజయ్.. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని చెప్పారు. మీరు ఇంత ప్రేమిస్తారు… ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అన్నారు. ఇది కూడా తనకు ఓ రకమైన అనుభవమేనని తెలిపారు.

కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఫెడరల్ ఏజెన్సీ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘనపై విచారణ చేపట్టింది. లైగర్ పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా వచ్చాయని జడ్సన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. చాలా మంది రాజకీయ నాయకులు లైగర్ సినిమాలో బ్లాక్ మనీ పెట్టుబడులుగా పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి, పన్ను చెల్లింపుల నుండి తప్పించుకోవడానికి ఇది సులభమైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. అనేక విదేశీ కంపెనీలు మోసపూరిత మార్గాల ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టాయని జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కోవడం తో ఈడీ విచారణ చేపట్టింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం 5 భాషల్లో నిర్మాణమై, విడుదలైన ఈ చిత్రానికి ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు చేశారు. అయితే లాభాలు రాకపోగా, పెట్టుబడిని కూడా తిరిగి పొందడంలో లైగర్ ఘోరంగా విఫలమైంది.