అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల కపట ప్రేమను చూపించారుః నక్కా

అమరావతిః టిడిపి సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు సిఎం జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్కు ఓట్లేసి సిఎంని చేసిన పాపానికి దళితులంతా ఎవరికివారు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏపీలో నెలకొందని ఆయన అన్నారు. అనంతపురంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ దళితుడు కావడం వల్లే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని, ఉద్యోగం నుంచి తీసేసేంత వరకు ఆయన పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రకాశ్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే పోలీసులు సుమోటోగా కేసు పెట్టారని అన్నారు.
అదే జిల్లాకు చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ రాచమర్యాదలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమకు న్యాయపరంగా రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ప్రకాశ్ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్య దారుణమని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల జగన్ కపట ప్రేమను చూపించారని… అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/