నేటి నుంచి నాగోబా మహా జాతర

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా మహా జాతర నేడు ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు ఇప్పటికే 220 కి.మీ దూరం కాలినడకన వెళ్లి పవిత్ర గోదావరి జలాన్ని తీసుకొచ్చారు. ఆ జలంతో ఈరోజు అర్ధరాత్రి నాగోబాకు పూజ చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈనెల 15 వరకు కొనసాగే ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, బిహార్, ఏపీ నుంచి భక్తులు తరలివస్తారు.

విదేశాల నుంచి పర్యాటకులు, సం దర్శకులు వచ్చి దర్శించుకుంటారు. ఇప్పటికే గంగాజలంతో మర్రిచెట్ల వద్ద మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా ఐదు రోజులపా టు బస చేశారు. నేటి సాయంత్రం సంప్రదాయబద్ధంగా ఎడ్లబండ్లలో గోవాడ్‌కు చేరుకుంటారు. రాత్రి ఆలయాన్ని పవిత్ర గంగాజలం తో శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేస్తారు. నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేస్తారు. వీటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకుంటారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజనుల నమ్మకం. కాగా, ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.

జాతర సందర్భంగా యేటా నిర్వహించే దర్బార్‌కు ప్రత్యేకత ఉంది. 78 ఏండ్ల క్రితం మారుమూల గ్రామాలకు సౌకర్యాలు లేవు. గిరిజనుల వద్దకు అధికారులు వచ్చేవారు కాదు. ఈ సమయంలోనే గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్‌ జిల్లాకు వచ్చారు. కేస్లాపూర్‌లో జరిగే జాతర గురించి తెలుసుకున్నారు. దీనిని గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకుని దర్బార్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో గిరిజనుల సమస్యలపై చర్చించారు. హైమన్‌డార్ఫ్‌ 1946లో మొదటి దర్బార్‌ను నాగోబా జాతరలో నిర్వహించారు. అప్పటి నుంచి యేటా గిరిజనులు నిర్వహిస్తున్నారు.