ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన

ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా వివిధ ప్రాంతాల నుంచి ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ మంత్రులు హరీశ్, తలసాని, ఇతర ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులతో వచ్చిన వారిని గేటు వద్ద సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి తమ బ్రతుకులు రోడ్డున పడ్డయానై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పధకాన్ని తొలగించాలని , లేదా మాకు ఓ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తన్నారు, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు సపోర్ట్ గా నిలుస్తుంది.

ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సుధీర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌.. హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. గిరాకీ లేక 6.5 లక్షల ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతోమంది ఉపవాసాలు ఉంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.