గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ

telangana-assembly-sessions-2024

హైదరాబాద్‌ః గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మ్యానిఫెస్టోలో అన్నీ మోసాపూరిత హామీలేనని యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. 2014, 2018లో ఇచ్చిన హామీలన్నీ కలిపి 420 అవుతాయని ఎద్దేవా చేశారు. పరిపాలన ప్రగతి భవన్‌, ఫామ్‌హౌస్‌ నుంచి జరగకూడదని అన్నారు. పరిపాలన అనేది సచివాలయం నుంచి జరగాలన్నారు. కర్ర కాల్చి వాత పెట్టే చైతన్య తెలంగాణ అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము పాలకులం కాదు సేవకులం అని తమ సీఎం చెప్పారని తెలిపారు. తాము ఇచ్చిన గ్యారంటీలు అన్ని పేదలకు ఉపయోగపడతాయని తెలిపారు.

పదేళ్లుగా అన్ని రంగాలను ధ్వంసం చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణ ఉద్యమకారులంటే గత ప్రభుత్వానికి గౌరవం లేదని చెప్పారు. గత ప్రభుత్వం గద్దర్‌ను కూడా గౌరవించలేదని ఆరోపించారు. తాము వచ్చాక గద్దర్ జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు చేశారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలో బాధ్యతారాహిత్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రైవేటు వర్సిటీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదని అన్నారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా ఘోరంగా అవమానించారని అన్నారు.