వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై నాగబాబు ఆగ్రహం..

ఏపీలో రాజకీయాలు రోజుకు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అధికారపార్టీ సింగిల్ గా బరిలోకి దిగుతుంటే..మిగతా పార్టీల పొత్తు అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే జనసేన , బిజెపి పొత్తు ఉండగా..టీడీపీ జత కలిసేది లేనిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో టిడిపి , జనసేన కార్య కర్తలు , అభిమానులు రాబోయే ఎన్నికల్లో టిడిపి , జనసేన కలిసి పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ సపోర్ట్ మీడియా కేసీఆర్ పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేశారంటూ ప్రచారం చేయడం ఏపీలో పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా లేదంటే ఒంటరిగా బరిలోకి దిగినా.. కేసీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ప్రచారం చేసింది.

పవన్ కళ్యాణ్ కు బిఆర్ఎస్ వెయ్యి కోట్ల ఆఫర్ ప్రకటించారనే ప్రచారం ఫై జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే.. పవన్ కళ్యాణ్‌కు వచ్చే నష్టమేం లేదన్న నాగబాబు.. కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త అని హెచ్చరించారు. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలని నాగబాబు ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే.. అవినీతి రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిర అవుతారేమో గానీ.. నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలని సూచించారు.

పవన్‌ కళ్యాణ్‌ మరో పాతికేళ్లపాటు ప్రజల కోసం యుద్ధం చేయగలడన్న నాగబాబు.. మీకు అంత ఓపిక లేదంటూ.. పరోక్షంగా చంద్రబాబు వయసును ప్రస్తావించారు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తమకు లేదన్నారు. ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ ఇంకెన్నాళ్లు వాగి చస్తారని నిలదీశారు. మిగతా రెండు పార్టీల నాయకులను అదే మాట అనే దమ్ము మీకు లేదంటూ చురకలు అంటించారు.