కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్నాటకం జరుగుతోందిః నాదెండ్ల

కొత్త పరిశ్రమ అంటూ హంగామా చేస్తున్నారన్న నాదెండ్ల

nadendla-manohar

అమరావతిః కడప జిల్లాలో జేఎస్ డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ నిర్మించనుందని సీఎం జగన్ ప్రకటించగా, నిన్న ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్నాటకం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని గతంలో ఇద్దరు కృష్ణులు వచ్చారని, ఇప్పుడు మూడో కృష్ణుడిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో ప్రారంభిస్తామని, 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని సీఎం జగన్ శంకుస్థాపన రోజున పెద్దపెద్ద మాటలు చెప్పారని వివరించారు. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తామని చెప్పారని, ఇప్పటిదాకా పునాది రాయి కూడా పడలేదని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశంలో మాత్రం కొత్త పరిశ్రమను తీసుకువచ్చినట్టు హంగామా చేస్తున్నారని విమర్శించారు.

“మొదట లిబర్టీ ఎస్సార్ స్టీల్స్ అనే కృష్ణుడు వచ్చాడు. రూ.17 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ కు చెందిన మరో కృష్ణుడు రూ.12 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నాడు. ఆయన కూడా పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెడతానంటూ మూడో కృష్ణుడిగా జేఎస్ డబ్ల్యూ అనే కొత్త కంపెనీ వచ్చింది. ప్రాజెక్టు ఇన్ని కంపెనీల చేతులు మారడానికి, నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను సీఎం ప్రజలకు వివరించాలి. దాంతోపాటే, కడప స్టీల్ ప్లాంట్ కోసం కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్తు కేటాయించారు… ఆ బెర్త్ ఎవరికి అమ్మేశారో చెప్పాలి… దాని వెనుక జరిగిన జగన్నాటకాన్ని ప్రజలకు వివరించాలి” అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/