జల వివాదంపై జగన్ తన వైఖరేంటో స్పష్టం చేయాలి

జగన్ అధికారంలోకి వచ్చాక అంతా అయోమయం, గందరగోళం: నాదెండ్ల మనోహర్

గుంటూరు : సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రంలో పాలన అంతా అయోమయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడిన నాదెండ్ల.. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై జగన్ ఇప్పటికైనా తన వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హక్కుగా రావాల్సిన నీటి విషయంలో జగన్ ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ సొంత కుటుంబంలోని వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతుంటే, ఇక్కడి మంత్రులు మరో రకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తమ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో త్వరలోనే నీటి పారుదల నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మనోహర్ తెలిపారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తమ వలంటీర్ల ద్వారా పార్టీలుగా విభజించారని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/