పవన్ కళ్యాణ్ ఫై కుట్రపూరిత కేసు – నాదెండ్ల

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. గత సంవత్సరం జూలై 9న వలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటీషన్ పై విచారించిన గుంటూరు కోర్టు పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. విచారణ నిమిత్తం నాలుగో అదనపు జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేసింది. మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులిచ్చారు.

ఈ నోటీసులపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా? దీనిపై ప్రశ్నిస్తే కేసు పెడతారా? వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వాలంటీర్లకు ఏటా రూ. 1,760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ. 617 కోట్లు డేటా సేకరణకే కేటాయించారు’ అని ఆరోపించారు.