రామోజీ రావు అంత్యక్రియలు పూర్తి

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. నిన్నంతా ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రామోజీఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఈరోజు ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు.

అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనం వద్ద రామోజీరావుకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాల మధ్య, పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు రామోజీ సంస్థల ఉద్యోగులు వందలాదిగా తరలివచ్చారు.