మల్కాజ్‌గిరి లో తండ్రి వెనుకంజ..మెదక్ లో కొడుకు ముందంజ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హావ కనపరుస్తుండగా..హైదరాబాద్ లో మాత్రం కారు జోరు నడుస్తుంది. ఇక మల్కాజ్‌గిరి నియోజకవర్గం విషయానికి వస్తే… బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నడుస్తుంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. తన తనయుడికి మెదక్ సీటు ఇవ్వకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నారు.

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. తనకు మల్కాజ్‌గిరి, తన తనయుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్లు సాధించారు. గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మైనంపల్లి.. ఈ సారి కాంగ్రెస్ టికెట్‌పై బరిలో నిలవడంతో మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో 4,89,043 మంది ఓటర్లు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 54.02 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. బిఆర్ఎస్ ఫై కోపంతో కాంగ్రెస్ పార్టీ లో చేరిన మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంత రావు వెనుకంజలో కొనసాగుతున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. మరోవైపు మెదక్లో మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.