అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ..సుముహూర్తం 84 సెకండ్లే

ప్రధాని మోడీ విగ్రహ కళ్లకు అచ్ఛాదనగా ఉన్న విస్తాన్ని తొలగిస్తారు..బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కటుక దిద్దుతారు..రామలల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు.
Ram temple opening: Auspicious ‘muhurta’ to last only 84 seconds

అయోధ్యః సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. వేద పండితులు, సాధువుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయించారు. ఈ సుముహూర్తం కేవలం 84 సెకండ్ల పాటు మాత్రమే ఉందని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12:29 గంటల 03 సెకండ్ల నుంచి 12:30 గంటల 35 సెకండ్ల వరకు అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సమయంలోనే ప్రధాని మోడీ విగ్రహ కళ్లకు అచ్ఛాదనగా ఉన్న విస్తాన్ని తొలగిస్తారు. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కటుక దిద్దుతారు. రామలల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో “మహ హారతి” ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ తంతు ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మరికాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు. ఉదయం 10:25 గంటలకు అయోధ్యకు చేరుకుని వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న 7 వేల మంది అతిథులు అయోధ్య చేరుకున్నారు. కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక అతిథులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆపై సీఎం యోగి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ గోపాల్ దాస్ కూడా ప్రసంగిస్తారు.

కాగా, సీబీఆర్‌ఐ సైంటిస్టు ఆర్‌ ధర్మరాజు మాట్లాడుతూ, ‘సూర్య కిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి గర్భగుడిలోని విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాతే ‘సూర్య తిలకం’ ఆవిష్కృతం అవుతుంది’ అని చెప్పారు. ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌’ నుంచి సీబీఆర్‌ఐ సైంటిస్టులు సాయం తీసుకున్నారు. కావాల్సిన వస్తువులను, పరికరాలను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆప్టిక్‌’ సంస్థ తయారుచేసింది.