తెరాస పార్టీ లో విషాదం : మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

తెరాస పార్టీ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జాహీరాబాద్‌కు చెందిన అల్హాజ్ మహమ్మద్ ఫరీదుద్దీన్‌… హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికొత్స పొందుతూ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఫరీదుద్దీన్ మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలిపారు. ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ.. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తి అయ్యింది.