ఢిల్లీలో మునావర్ షో కు అనుమతి నిరాకరణ

ఢిల్లీలో మునావర్ షో కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య వాటిల్లే అవకాశం ఉన్నందున రేపటి షోకు అనుమతులు నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఫరూకీ షోపై అభ్యంతరాలు తెలుపుతూ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు వీహెచ్‌పీ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా లేఖ రాశారు. మునావర్ తన షోలో హిందూ దేవుళ్లను అవమానిస్తారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఆయన షోకు అనుమతులు ఇస్తే హైదరాబాద్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని ఢిల్లీ సీపీ దృష్టికి ఆయన తీసుకు వెళ్లారు. అందువల్ల మునావర్ షోకు అనుమతులు ఇవ్వకూడదంటూ ఆయన కోరారు.

మునావర్ ఫారుఖీ షో లపై ఇటీవల జరుగుతున్న సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోనూ అతను షో నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మునావర్ షో ఉంటుందని ఆరోపిస్తూ అప్పట్లో బీజేవైఎం నేతలు తెలంగాణ డీజీపీని కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లోనే కాదు.. బెంగళూరులో జరగాల్సిన మునావర్ షో సైతం అర్థాంతరంగా ఆగిపోయింది.