బౌలర్లను హెచ్చరించిన ధోనీ

IPL సీజన్ 16 లో భాగంగా లక్నో సూపర్ గెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో ధోని సేన గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచినప్పటికీ.. ఫాస్ట్ బౌలర్ల తీరు పట్ల కెప్టెన్ ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తరచుగా ఎక్స్‌ట్రా‌లు ఇస్తుండటం పట్ల బౌలర్లకు కెప్టెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌కు ముందు బౌలర్లతో ధోనీ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలింగులో మనం మరింత మెరుగుపడాల్సి ఉందన్నాడు. పరిస్థితులను బట్టి బౌలింగ్ చేయాలని సూచించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఓ కన్నేసి ఉంచాలని, వారేం చేస్తున్నారో పరిశీలించాలని అన్నాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. నోబాల్స్, వైడ్లు వేయొద్దని, ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

చెపాక్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌‌లో చెన్నై బౌలర్లు ఏకంగా 13 వైడ్లు, మూడు నో బాల్స్ వేశారు. ఈ మూడు నోబాల్స్‌ను తుషార్ పాండే వేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై 17 వైడ్లు, 7 నోబాల్స్ వేయడం గమనార్హం. బౌలర్లు ఇలా వైడ్లు, నోబాల్స్ వేయడం ధోనీకి ఆగ్రహం తెప్పించింది.