సజ్జల ను పక్కకు పెట్టకపోతే సంక్షోభం తప్పదు..జగన్ ను హెచ్చరించిన రఘురామ

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

సజ్జల రామకృష్ణ రెడ్డి ని పక్కకు పెట్టకపోతే పార్టీ లో సంక్షోభం తప్పదని హెచ్చరించారు వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. టీడీపీ పార్టీ లో అప్పట్లో లక్ష్మీ పార్వతి పోషించిన రోల్‌ను ఇప్పుడు వైస్సార్సీపీ లో సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారని, జగన్ మేలుకోకుంటే సంక్షోభం తప్పదని ఎంపీ రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు.

ఎన్టీ రామారావు ఎంత మంచివారైనా పార్టీలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్నారు. ఇప్పుడు వైస్సార్సీపీలో సజ్జల కూడా అలానే వ్యవహరిస్తున్నారని, పరిస్థితి చేయి దాటిపోకముందే ఆయనను పక్కనపెట్టాలని, లేదంటే నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని జగన్‌కు సూచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక వర్గం ఎమ్మెల్యేలు వైస్సార్సీపీ లక్ష్మీపార్వతిగా సంబోధిస్తుంటే, మరొక వర్గం ఎమ్మెల్యేలు మగ లక్ష్మీపార్వతి అని అంటున్నారన్నారని రఘురామ విమర్శలు చేశారు. పరిస్థితి చేయి దాటకముందే, మగ లక్ష్మీపార్వతిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అయి, ఇంకా ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చునని హెచ్చరించారు. ఇప్పటికీ మెజారిటీ మంది శాసనసభ్యులు, సీఎం జగన్ గారినే ప్రేమిస్తున్నారని, ఆయన తక్షణమే అపరిచితుడు క్యారెక్టర్ వీడి, రామాచారి క్యారెక్టర్ లోకి రావాలని, రామాచారిగా ఒకే ఒక పాత్ర పోషించాలని సూచించారు.