కేటీఆర్ డ్రగ్స్ వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ కౌంటర్

తనపై వస్తున్న డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధం అని.. డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా..? నా రక్తం, నా చర్మం తీసుకుపోతాడా..? ఏం తీసుకుపోతడో తీసుకపొమ్మను. నా వెంట్రుకలు కూడా ఇస్తా. నేను బయటకు చిత్తశుద్ధితో వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా..? నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా..? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడ్నే ఉంటాను. రమ్మను. ఏ డాక్టర్ను తీసుకోస్తడో తీసుకురమ్మను. నా వెంట్రుకలు, నా రక్తం, నా గోర్లు, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా అంటూ బిజెపి నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
కేటీఆర్ సవాల్ కు బిజెపి ఎంపీ అరవింద్ కౌంటర్ వేశారు. డ్రగ్స్ టెస్టు ప్రస్తావన కేటీఆరే ముందు తీసుకువచ్చారని అర్వింద్ అన్నారు. గతంలో డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారని ఆయన గుర్తుచేశారు. విమర్శలు వచ్చినప్పుడు స్వచ్చందంగా టెస్టు చేయించుకోవాలని.. దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నీ గోర్లు, జుట్టు, చర్మం ఎవరికి కావాలంటూ కేటీఆర్ పై విమర్శలు చేశారు. అసలు కేటీఆర్కు లవంగానికి, తంబాకుకు తేడా తెల్వదని అర్వింద్ విమర్శలు చేశారు.