ఏపిలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

వ‌చ్చే నెల 10 నుంచి ఎన్నికలు..గతంలో ఆగిన చోట నుండే కొనసాగించేలా ఉత్తర్వులు

అమరావతి: ఏపిలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ నిలిచిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచే దీన్ని కొన‌సాగించాల‌ని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10 పోలింగ్‌ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. 

కాగా, గత ఏడాది మార్చి 23న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు చేసుకోగా క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా వాయిదాప‌డ్డ విష‌యం విషం తెలిసిందే. అప్ప‌టికే 12 నగరపాలక సంస్థల్లో అభ్యర్థులు 6,563 మంది నామినేషన్లు దాఖ‌లు చేశారు. అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. మ‌రోవైపు, ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. తొలి రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ పూర్తయింది.