ఈడీ చార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు. కవిత వాడిన పది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జీషీటులో పేర్కొంది. కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ రామ చంద్రపిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఛార్జీషీటులో ఈడీ ప్రస్తావించింది. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న వివరాల ప్రకారం.. మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అసలు భాగస్వాములుగా ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థ 14,05,58,890 సీసాల మద్యం విక్రయించి రూ. 192.8 కోట్లు సంపాదించింది. శ్రీనివాసులు రెడ్డి, శరత్‌రెడ్డి, రాఘవ్‌రెడ్డి, కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్ ఆప్ నాయకుల కోసం విజయ్‌నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చింది. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం వాటాను సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో అరుణ్‌పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో సౌత్‌గ్రూప్ ఇండోస్పిరిట్‌లోని వాటాను నడిపింది. అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు.

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అరుణ్‌ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్‌కు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 10 వేల కోట్ల ఆదాయం ఉందని అరుణ్ పిళ్లైతో ఆప్ బినామీ విజయ్‌నాయర్ చెప్పారు. పెద్ద తలకాయల కోసం చూస్తున్న సమయంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంపై ఆసక్తి చూపారు. ఆర్థిక వనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం బుచ్చిబాబును ఆయన ఇందులోకి తీసుకొచ్చారు. చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5లోపు చెప్పాలని ప్రతివాదులైన సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది.