ఆస్తి పంపకాలు అయ్యాకే తల్లి అంత్యక్రియలు – కొడుకుల పంచాయితీ

నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి రుణం ఎప్పటికి తీర్చలేనిది..కానీ ఇప్పుడు అలాంటి తల్లులనే రోడ్డున పడేస్తున్నారు. పిరికేడు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడని కొడుకులు ఉన్నారు..ఇక చనిపోతే మాకెందుకులే అనే కొడుకులు కూడా ఉన్నారు అనుకోండి. తాజాగా ఆస్తి పంపకాలు జరిగే వరకు తల్లి అంత్యక్రియలు జరిపేది లేదంటూ పెద్దల ముందు పంచాయితీ పెట్టిన కొడుకుల కథ వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా కందులవారి గూడెంలో ఈ ఘటన జరిగింది.

వేము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె వద్ద రూ.21 లక్షల విలువైన ఆస్తి, 20 తులాల బంగారం ఉన్నాయి. ఒక కుమారుడు ఇదివరకే మరణించాడు. తల్లి మరణవార్త తెలుసుకున్న కుమార్తెలు, కోడలు, మరో కుమారుడు కందులవారి గూడెం చేరుకున్నారు. అంత్యక్రియల విషయం ఆలోచించకుండా ఆస్తి కోసం గొడవ పడ్డారు. గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టుకున్నారు. రెండ్రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది తప్ప.. ఓ కొలిక్కి రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. కన్నబిడ్డలే దహనసంస్కారాలు చేయకుండా తాత్సారం చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.