కొత్తవలసలోని జిందాల్‌ పరిశ్రమ మూసివేత

ఏపీలో మరో పరిశ్రమ మూతపడింది. గత ప్రభుత్వం లో అనేక కొత్త పరిశ్రమలు రాగా..ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాకపోగా..ఉన్న పరిశ్రమలు మూతపడడం..ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరో పరిశ్రమ మూతపడింది. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్‌ స్టీల్‌ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. అందులో పనిచేస్తున్న 57 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించింది.

పరిశ్రమకు ప్రధాన ముడి సరకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు యూనిట్‌ హెడ్‌ దినేశ్‌ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. దాన్ని కంపెనీ వద్ద బోర్డులో పెట్టారు. అయితే యాజమాన్యం తీరు ఫై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడాన్ని వారు తప్పుబట్టారు. ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు. పరిశ్రమ మూసివేతతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.