అక్రమసంబంధానికి అడ్డు వస్తుందని కన్నబిడ్డనే చంపేసిన కసాయితల్లి

నవమాసాలు మోసి కని పెంచిన తల్లే..తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న బిడ్డనే అతి కిరాతకంగా చంపేసిన ఘటన కుషాయిగూడలో చోటుచేసుకుంది. కాప్రా సర్కిల్‌ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్‌ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్‌వాడి రమేష్‌ కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కల్యాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తన్విత (4 సంవత్సరాల 6 నెలలు) అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు.కళ్యాణి కూతురిని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. పాప స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. భర్త నుంచి విడిపోయిన కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పాప అడ్డుగా ఉందని భావించిన తల్లి.. నిద్రిస్తున్న నాలుగున్నరేళ్ల బాలికను దిండుతో కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లు ప్రవర్తించింది. నిద్రిస్తున్న కూతురు నిద్రలోనే మృతి చెందిందని తల్లి కల్యాణి కన్నీరుమున్నీరైంది. అయితే కూతురు మృతి పట్ల భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త రమేష్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చిన్నారి తల్లి కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన కూతురిని తానే హత్య చేసినట్లు అంగీకరించింది.