కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం.. బర్రెలక్క పై దాడి

కొల్లాపూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క (శిరీష ) తమ్ముళ్లపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. సోషల్ మీడియా లో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో స్పందించి పాపులర్ ఐన శిరీష..ఇప్పుడు ఎన్నికల బరిలో అధికార , ప్రతిపక్ష పార్టీలకు పోటీగా బరిలోకి దిగింది. ధైర్యంగా, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన ఈమెకు నియోజకవర్గ ప్రజలతో పాటు పలు సంఘాలు , విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో శిరీష‌కు అనుకూలంగా.. పాట‌లు, నినాదాలు.. పోటెత్తుతున్నాయి. స్వ‌చ్ఛంద సంస్థ‌లు బ్యాన‌ర్లు, ఎన్నిక‌ల సామాగ్రిని ఆమెకు అందిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ..మంగళవారం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమెపై, ఆమె తమ్ముళ్ల ఫై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై ఏ పార్టీ వారు దాడి చేశారో తెలియదని.. తాను ఎన్నికల బరిలో ఉంటే ఓట్లు చీలుతాయనే భయంతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి దిగిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు.